Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

MIHS Alumni Diary 2023

Page No: 2 | Views: 425 |  1

గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి

 

2023 సెప్టెంబర్ 16.. సాయంత్రం 4.57 నిమిషాలకు గజిబిజి లైఫ్‌లో బిజీబిజీగా ఆఫీస్ వర్క్ చేస్తుండగా నా ఫోన్ మోగింది. తీరా చూస్తే వాట్సాప్ కాల్.. తెలియని నంబర్ నుంచి వస్తున్నా మనిషి తెలిసినవారే అనుకొని లిఫ్ట్ చేశా. "ఏరా అబ్బి.. మురళీ కృష్ణేనా" అంటూ అటు నుంచి అడిగారు. అవును మీరెవరూ అని అడిగే లోపే.. నేనురా శిరీష మిస్‌ని.. 'మేరి ఇమ్మేక్యులేట్ స్కూల్' నుంచి అని చెప్పారు. అదెదో సినిమాలో చెప్పినట్లు ఒక్క క్షణం నా మనస్సు రెక్కలు కట్టుకొని హైదరాబాద్ నుంచి అర సెకన్లో సామర్లకోటలోని మన స్కూల్ గేటు ముందు వాలిపోయింది. శిరీష మిస్ మాట్లాడుతూనే ఉన్నారు కానీ నేను మాత్రం మనసులో స్కూల్ గేటు తీసి బరువైన బ్యాగ్‌తో (హృదయం అంత కంటే బరువుగా) లోపలికి అడుగుపెట్టేశాను. ఎదురుగా సిస్టర్స్ కోటస్‌కి వేసిన సిమెంట్ రోడ్డు.. దానికి అటువైపు పెద్ద చెట్లు అన్నీ అలానే ఉన్నాయి.. కొద్దిగా ముందుకెళ్లి ఎడమ వైపు చూస్తే ఆనాడు నేను ఆడిన 'కోకో' కోర్టు.. కుడి వైపు చిన్న గ్రౌండ్‌కి వెళ్లే గేటు.. ఎదురుగా నాకెంతో ఇష్టమైన మామిడి చెట్టు. ఇక తలెత్తి చూస్తే 'MIHS School'అంటూ పెద్ద అక్షరాలతో పేరు కనిపించింది. ఆ బిల్డింగ్ ముందు కాపలాకి నిల్చున్నట్లుగా అశోక వృక్షాలు.. ఇప్పటికీ అలానే ఉన్నాయి.

 

అప్పుడే ఆత్రంగా నా క్లాసుకి వెళ్లాలి అన్నట్లుగా పరుగుపరుగున మెట్లు ఎక్కుతుంటే "రేయ్.. అబ్బి.. గొంతు చించుకొని అరుస్తుంటే మాట్లాడవేంరా" అంటూ శిరీష మిస్ వాయిస్ వినిపించింది. కళ్లు తెరిచి చూస్తే (మనసు మూసి) అదే ఆఫీసులో అదే చైర్‌లో ఎప్పటిలానే కూర్చొని ఉన్నా. ఇక కుశల ప్రశ్నలు ముగిసిన తర్వాత ఏం చేస్తున్నావ్‌రా మురళీ ఇప్పుడు.. నువ్వు కూడా సాఫ్ట్‌వేరేనా అని మిస్ అడిగారు. లేదు మేడమ్ నేను జర్నలిస్ట్.. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న అని చెప్పా. ఒరేయ్ .. నువ్వు జర్నలిస్ట్ అయ్యావా అంటూ మిస్ గొంతులో ఒకింత ఆశ్చర్యం.. 10 ఇంతల సంతోషం వినిపించాయి. ఇక తప్పకుండా గెట్స్‌కి రావాలి అని చెప్పి మిస్ ఫోన్ కట్ చేశారు.

 

చాలా రోజుల తర్వాత మళ్లీ మన స్కూల్ పేరు వినిపించింది కదా.. మనసులో ఏదో తెలియని సంతోషం.. అంతకుమించిన ఆనందం తెలీకుండానే వచ్చేశాయి. ఒకసారిగా ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అంటూ మది తలుపులు తెరుచుకొని తనివితీరా నన్ను హత్తుకున్నట్లు అనిపించింది. జీవితంలో మనం ఎన్ని మెట్లు ఎక్కి ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఎక్కిన మొదటి మెట్టు (స్కూల్).. మనల్ని ఎక్కించిన మొదటి చేయి (స్కూల్ టీచర్స్)ని మర్చిపోలేం. అసలు మర్చిపోవడానికి అది ఒక జ్ఞాపకం కాదు కదా.. జీవితం. 

 

ఆడిన ఆటలు, పాడిన పాటలు, చేసిన అల్లరి, చదివిన చదువు, పొందిన సంతోషం, అందిన ఆనందం గురించి ఎంత చెప్పినా చెరగదు. ఆ తరగతి గది ఉత్సాహం..  ఎంత తలచినా తరగదు. ప్రపంచమంతా ఎన్ని రకాల డైమండ్స్ ఉన్నా కోహినూర్ వజ్రం ప్రత్యేకత వేరు కదా. అలానే ఆనాడు ఎంతమంది వజ్రాల్లాంటి టీచర్లున్నా నా కోహినూర్ వజ్రం మాత్రం తెలుగు టీచర్ మేరి రాణి మిస్సే. క్లాస్ టెస్టులో ఆలోచన కంటే వేగంగా పరీక్ష పూర్తి చేసి మేడమ్ చేతిలో బుక్ పెట్టినప్పుడు వచ్చే సంతోషం.. ప్రపంచకప్ గెలిచినా రాదేమో అనిపించేది. నాకు ఎలా అయితే మేరి రాణి మిస్ అంటే ఇష్టమో.. ఆవిడకి కూడా నేనంటే అంతకంటే ఎక్కువే ఇష్టం. తన కొడుకులానే చూసేవారు.. అంత ప్రేమగా మాట్లాడేవారు. ఆరోజు మేరి రాణి మిస్ దగ్గర నేర్చుకున్న ఆ తెలుగే.. ఈరోజు నా వృత్తికి, ప్రవృత్తికి ఆధారంగా నిలిచింది. అదే తెలుగు.. నన్ను వెలుగులో నిలబెట్టింది. జర్నలిస్ట్‌గా ఒక మంచి పేరు తెచ్చిపెట్టేలా చేసింది. 

 

ఇక ఆ క్లాసు గుసగుసలు.. అమ్మాయిల రుసరుసలు.. ఫ్రెండ్స్ కోపాలు, తిట్టుకోవడం, తన్నుకోవడం.. అబ్బో ఆ సందడి మళ్లీ మళ్లీ రాదు (రాదు అనడానికి బాధ పడుతూ). స్కూల్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఓ సంక్రాంతి లాంటిది. కానీ సంక్రాంతి ఏడాదికి ఒక్కసారి వస్తే.. స్కూల్ లైఫ్ మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తుంది. దాన్ని వీలైనంత ఎంజాయ్ చేయాలి. చదువుతూ ఎంజాయ్ చేయాలి.. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాలి. అలాంటి ఒక మంచి స్కూల్ లైఫ్‌ను నాకిచ్చిన 'మేరి ఇమ్మేక్యులేట్ స్కూల్'కి, టీచర్స్‌కి.. ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు ఇంత ఇచ్చిన స్కూల్‌కి ఏదో ఒకటి తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావు అయిపోతా.. అందుకే వీలు చిక్కినప్పుడల్లా (మీరు పిలవకపోయినా) అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉంటాను. ఎద లోతులో ఏ మూలనో నిదురించే జ్ఞాపకాలను తట్టి లేపుతూ ఉంటాను. చివరిగా ఒక్క మాట.. థాంక్స్ ఫర్ ఎవ్రిథింగ్

 

                  - RK Murali Krishna (2010-11)