Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
ఎందుకో గతంలోకి వెళ్లి ఒక సంఘటన మీతో పంచుకుందామనుకున్నాను. అప్పుడు నాకు 16 యేళ్ళు..ఇంటర్ హాస్టల్ లో ఉండడం వలన అన్న పానీయాలు సరిగ్గా తీసుకోక,
సమయానికి తినక, వంటికి కావాల్సిన అన్ని నీళ్లు రోజు తాగాలని తెలియక..నాలుగు రాళ్లు వెనక వేసుకున్న రోజులవి...
నేను ఇంటర్ లో కాయ కష్టం చేసి రాళ్లు వెనక వేసుకోలేదు అండీ..
నీళ్లు తాగకపోవడం వలన నాలుగు రాళ్లు కిడ్నీ లో చేరాయి.
హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను... నీళ్లు తాగుతున్న వాంతులు అవ్వడం వలన, సెలైన్ ఎక్కించారు.. ఒకటి కాదు నాలుగు గంటల్లో ఆరు బాటిల్ లు.. ఇంకా అవసరం పడతాయి అని అన్నారు.
మొదట కాస్త ఇబ్బంది పడిన తరువాత అలవాటు అయిపోయింది. అలా నర్స్ తో, డాక్టర్ తో కాలక్షేపం చేస్తున్న నాకు ఈ పదం చెవిన పడింది.
ఏ పదం???
"నిశీధి ఓడ" అనే పదం..ఒక డాక్టర్ ఫోన్ లో ఇలా అంటున్నారు...
డాక్టర్ వృతి అన్నాక నిశీధి లో ఓడ వంటిది..
మనకి వచ్చిన తెలుగు ప్రకారం.. నిశీధి అంటే చీకటి..
ఇదేంటి చీకటి లో ఉన్న షిప్ (ఇంగ్లీషు మీడియం ప్రబావం లెండి)
డాక్టర్ వృతికు సమానం ఏమిటో అనుకొని...
తలలో పేను, మెదడు లో ప్రశ్న వేదించిన వెంటనే, ఆలోచించకుండా ప్రతిచర్యను మొదలు పెట్టాలి పేనుకు దురద తగ్గించాలి.. ప్రశ్నకు సమాదానం వెతకాలి.
వెంటనే ఆ డాక్టర్ను పిలిచి.. నా సందేహ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆయనకు ఇచ్చి అర్జునుడిలా వినయంగా కూర్చున్న.
ఆ డాక్టర్ పేరు కూడా శ్రీ కృష్ణ...
ఇంక అస్సలు విషయానికి వస్తే..
ఓడ ప్రయాణానికి రాత్రి పగలు తేడా ఉండదు..
నడి సంద్రంలో వెళ్లాక అరెరె చీకటి పడింది.,
నేను ఒడ్డుకు వెళ్లి విశ్రాంతి తీసుకొని మళ్లీ రేపు ఉదయం మొదలు పెడతా అనడానికి లేదు..
పగలు ఐనా, చీకటి ఐనా..
సంద్రం ఎగిసి పడుతున్నా,
సుడిగుండం ఎదురు వచ్చినా...
మొదలు పెట్టినది పూర్తి చేయవలసినదే...
అలాగే డాక్టర్ కూడా కదా...
ఎంత మంది ఎదురు చూస్తున్నారు.. రాత్రి అయ్యింది, నేను చేయను అంటే కుదరదు.. తెల్లవారేదాక వేచి ఉండలేము.
అప్పుడు నాకు అనిపించింది.. డాక్టర్ ఏ కాదు.. ఏ వృతి ఐనా అంతే..పుట్టిన ప్రతి మనిషి, రేపటి ఉదయం కోసం (బంగారు భవిష్యత్తు కోసం) ఈరోజు చీకటి లో ప్రయాణం ( కృషి) చేయాల్సిందే...
-ఇందు జగన్నాధ్