Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

గంగమ్మ

Page No: 1 | Views: 398 |  0

వాసూ! పాపని చూసుకోడానికి ఈరోజు ఎవరో వస్తారు అన్నావు?" అడిగింది సుకన్య. 

 

 

 

"అవును సుకన్యా మరచేపోయాను 9 గంటలకల్లా పంపిస్తానని చెప్పారే మామయ్య!. బహుశా దారిలో ఉందేమో! ఇంకాసేపు చూద్దాం." అంటుండగానే....

 

 

 

"అమ్మా ఎవరైనా ఉన్నారా ఇంట్లో?" అంటూ ఎవరో పిలుస్తున్న స్వరం వినపడి బయటకి వెళ్ళి చూసింది సుకన్య. 

 

 

 

"ఎవరమ్మా నువ్వు?"

 

 

 

"నా పేరు గంగ, సుబ్బయ్య గారు పంపించారు అండి."

 

 

 

"ఓహ్ నువ్వేనా...! రా లోపలికి నీకోసమే ఎదురుచూస్తున్నాం." లోపలికి పిలిచింది సుకన్య.

 

 

 

"చూడు గంగా! ఈయన మా వారు పేరు వాసు, నా పేరు సుకన్య , ఇక మా పాప పేరు పింకీ తనకిప్పుడు 4 సంవత్సరాలు. నువ్వు చూసుకోవలసింది తననే" అంటూ గదిలో నిద్రిస్తున్న పాపని చూపించింది. 

 

 

 

"ఇక పోతే ఉదయం 8.30 కల్లా నువ్విక్కడ ఉండాలి. కొంచెం ఆలస్యం అయినా ఒప్పుకోను. పాప లేవగానే పాలు ఇవ్వాలి, అదీ చక్కెర లేకుండా. తర్వాత పాపని తయారు చేసి టిఫిన్ పెట్టేసి కొంతసేపు ఆడించు, ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి పాపకి ఏది కావాలో అది పెట్టు. ఇంకా.... అంటూ గుక్కతిప్పుకోకుండా చెబుతున్న సుకన్య భుజం మీద చెయ్యి వేసి" చూడు సుకన్యా ఆ అమ్మాయి ఇప్పుడే కదా వచ్చింది అప్పుడే ఇలా అన్నీ ఏకరువు పెడితే ఎలా?". అడిగాడు వాసు.

 

 

 

"అందుకే ఉదయం నుండి సాయంత్రం వరకు పాప ఏం చేస్తుందో, ఏం ఏం తింటుందో అన్నీ ఈ పేపర్ లో రాశాను." అంటూ బ్యాగ్లోని కాగితం తీసి గంగ చేతిలో పెట్టింది." ఇంతకీ నీకు చదవడం వచ్చా?" అడిగింది సుకన్య.

 

 

 

"వచ్చమ్మా." 

 

 

 

"అయితే ఇంకా మంచిది. ఈ పేపర్ చూసి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇవ్వు..చాలా జగర్తగా చూసుకోవాలి." అంటూ లంచ్ బాక్స్ బ్యాగ్ లో పెట్టుకుంటూ అంది సుకన్య. 

 

 

 

"మేము సాయంత్రం వచ్చేవరకు ఉండు ఆ తర్వాత ఇంటికి వెళ్ళు" అని చెప్పేసి హడావిడిగా బయటకి నడిచింది. 

 

 

 

ఇంతకీ నీకు పిల్లలు ఉన్నారా?" అడిగింది గుమ్మం బయట అడుగుపెడుతూ ఆగి.

 

 

 

"లేరమ్మ గారు.."

 

 

 

"మరి ఎలా చూసుకుంటావు మా పాపని...! కనీసం ఇంతకుముందు అనుభవం అయినా ఉందా...?"

 

 

 

"ఉందమ్మా. అయినా పిల్లల్ని చూసుకోవడానికి అనుభవం అవసరం లేదమ్మా , తల్లి లాంటి మనసు ఉంటే చాలు, అందునా నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మీరేమి భయపడకండి నేను పాపని జాగర్తగా చూసుకుంటాను." 

 

 

 

బైక్ స్టార్ట్ చేస్తూ "జీతం అది మామయ్యా చెప్పే ఉంటాడుగా అయినా ఇంకో సారి చెప్తున్నాను. నెలకి 10 వేలు ఇస్తాము 3 పూటలా ఇక్కడే తినొచ్చు. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోవాలి. సెలవులు అంటూ నాగాలు పెడితే జీతంలో కట్ చేస్తాము." అని చెప్పేసి వెళ్ళిపోయారు.

 

******

 

నిద్ర లేచి "అమ్మా..." అని పిలుస్తూ బయటకి వచ్చింది పింకీ. పింకీ ఏడుపు వినగానే పరుగున పాప ముందు ప్రత్యక్షమైంది గంగ. అప్పటివరకు నిద్రమత్తులో ఉన్న పింకీ గంగని చూడగానే కళ్ళు నలుపుకుంటూ, నోట్లో వేలు పెట్టుకుని గంగవైపు వింతగా చూస్తూ నిలబడింది. 

 

 

 

"గుడ్ మార్నింగ్ పింకీ పాపా..! ఇలా రా...." అంటూ చేతులు ముందుకు చాపి ప్రేమగా పింకీ ని దగ్గరకు పిలిచింది. ఒక్కో అడుగు మెల్లిగా ముందుకు వేస్తూ గంగ దగ్గరకి రాగానే గంగ కళ్ళలోకి చూస్తూ "నువ్వెవరు? మా అమ్మ ఎక్కడ?" అని అడిగింది పింకీ.

 

 

 

"నా పేరు గంగ. నీతో ఆడుకోవడానికి వచ్చాను. అమ్మ ఆఫీస్ కి వెళ్ళింది సాయంత్రం వచ్చేస్తుంది ఈలోగా నాతో ఆడుకుంటావా?"

 

 

 

"ఓహో అది నువ్వేనా? మా అమ్మ నిన్న చెప్పింది రేపు నీతో ఆడుకోవడానికి ఒకరు వస్తారు అని." అంది ముద్దుగా ఒక వేలుతో గడ్డం మీద తట్టుకుంటు. 

 

"అవునమ్మా అది నేనే, నువ్వు త్వరగా తయారయ్యి వస్తే ఆడుకుందాం, పద పద ముందు వెళ్ళి బ్రష్ చేసుకొని స్నానంచేద్దాం." అంటూ పింకీ ని లోపలికి తీసుకెళ్లింది గంగ. 

 

 

 

"మా పింకీ ఎంత మంచి పాప కదా! ఎంత త్వరగా తయారయ్యింది, ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తిందామా?"

 

 

 

 "తిందాం, కానీ నాకు టీవీ లో కార్టూన్ పెడితేనే టిఫిన్ తింటాను" అంది పింకీ. 

 

 

 

"అవునా!! సరే అయితే ముందు నాకు నీ బొమ్మలు అన్నీ చూపించు నేను చూడలేదు కదా!" అడిగింది గంగ. 

 

 

 

ఆ మాటవిని టీవీ సంగతి మరచిపోయి తన బొమ్మలన్నింటిని గంగకి చూపించడం మొదలుపెట్టింది. అలా మాట్లాడిస్తూ బొమ్మల గురించి అడుగుతూ మెల్లిగా టిఫిన్ పెట్టేసింది గంగ. 

 

 

 

అలా కొద్ధి సేపటిలోనే గంగకి బాగా దగ్గరయ్యింది పింకీ. రోజూ ఒంటరిగా టీవీతో కాలక్షేపం చేసే పింకీ సాయంత్రం వరకు టీవీ జోలికి వెళ్ళలేదు. బోలెడన్ని కబుర్లు చెప్తూ, ఆటలు ఆడుతూ సరదాగా గడిపింది. ఆ పాప కల్మషం లేని స్వచ్ఛమైన నవ్వు, నిర్మలమైన మనసు గంగ మనసుని కట్టి పడేసాయి. 

 

 

 

ఉదయం నుండి బాగా ఆదుకోవడం మూలాన బాగా అలసిపోయిన పింకీ త్వరగా నిద్రపోయింది.

 

ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వచ్చిన సుకన్య నేరుగా పాప గదిలోకి వెళ్ళింది. అప్పటికే ఆదమరచి నిద్రపోతున్న పాపని చూసి 'ఏంటి ఈరోజు మా మహారాణి గారు అప్పుడే నిద్రపోయారు!' అనుకుంటూ ఆశ్చర్యంగా బయటకి నడిచింది. 

 

 

 

"ఏంటి గంగ ఏమైంది ఈరోజు పింకీకి, ఇంత త్వరగా పడుకుంది." అడిగింది సుకన్య. 

 

 

 

"ఉదయం నుండి ఆడి ఆడి అలసిపోయి పడుకుందమ్మా...ఇక చాలు అలసిపోతావు అని చెప్పినా వినలేదు ఆడుతూనే ఉంది."

 

 

 

"దాని అల్లరితో నిన్ను బాగా ఇబ్బంది పెట్టిందా?"

 

 

 

"అదేమీ లేదు అమ్మగారు...నాకూ సరదాగానే ఉంది తన అల్లరి. ఇక నేను వెళ్ళొస్తాను. పాప భోజనం చేసి పడుకుంది. ఇక ఇప్పుడు లేవదులేండి.. నేను రేపు ఉదయమే వస్తాను." అని చెప్పి వెళ్ళిపోయింది గంగ. 

 

 

 

 'ఏంటి ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది' అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు వాసు.

 

 

 

"వాసూ! నీకో విషయం తెలుసా!! ఈరోజు మన పింకీ పాప త్వరగా నిద్రపోయింది." అంది ఎప్పుడూ చూడని వింతని మొదటిసారి చూసినట్లుగా. 

 

 

 

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..తన వాటా కింద తీసిపెట్టిన ఫ్రూట్స్ , మిల్క్ అన్ని శుభ్రంగా తినేసింది కూడా."

 

 

 

"ఇదైతే నిజంగానే ఆశ్చర్యకరమైన విషయం. ఎప్పుడూ సగం కూడా తినని పింకీ ఈరోజు అన్నీ తినిందంటే నమ్మలేకపోతున్నాను. ఈ గంగ ఎవరో కానీ మన పాపని మంచిగా చూసుకుంటుంది." 

 

 

 

ఇద్దరు స్నానాలు చేసి భోజనం చేసి పడుకున్నారు. ఉదయం చెప్పిన సమయానికి ముందే పనిలోకి వచ్చేసింది గంగ. చెప్పక ముందే చెక చకా పనులన్నీ చేసుకుపోయింది. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయాక పింకీ ఎప్పుడెప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది. నిద్రలేవగానే ఎదురుగా ఉన్న గంగని చూసి నవ్వుతూ హత్తుకుంది పింకీ. పింకీ స్పర్శ తాలగానే ఏదో తెలియని అనుభూతి పొందింది గంగ. 

 

అలా 4 నెలలలో గంగకి బాగా దగ్గరయ్యింది. గంగని అమ్మా అని పిలవడం మొదలుపెట్టింది, తనని ప్రేమగా అలా పిలుస్తుంటే కాదనలేకపోయింది గంగ. 

 

 

 

ఇద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత బంధం ఏర్పడింది వారిరువురి మధ్య. పింకీకి సెలవులు అయిపోయి స్కూల్ ప్రారంభం అవడంతో ఇక గంగ పని అయిపోయింది అని గంగకి రావలసిన మొత్తం ముట్టజెప్పి పంపించేశారు.

 

 

 

రోజు ఉదయం నిద్ర లేవగానే కనపడే గంగ స్థానంలో ఉన్న సుకన్య ని చూసిన పింకీ "మమ్మీ.. గంగమ్మ ఎక్కడ?" అని అడిగింది. 

 

 

 

"గంగమ్మ ఎవరే?"

 

 

 

"అదే అమ్మ రోజు నాతో ఆడుకుంటుంది కదా ఆ అమ్మ."

 

 

 

"అది అమ్మ కాదు అంటీ, ఇక నుండి గంగ మనింటికి రాదు నీకు సెలవులు అయిపోయాయి కదా అందుకే పంపించేసాము. లే లేచి త్వరగా తయారవ్వు స్కూల్ వాన్ వచ్చేస్తుంది" అంది సుకన్య. 

 

 

 

ఆ మాట విన్న పింకీ మొహం వాడిపోయింది. ఏదో తెలియని బాధ. అలానే లేచి తయారయ్యి స్కూల్ కి వెళ్ళిపోయింది. 

 

*****

 

"పింకీ అన్నం తిందువుకానీ రా అమ్మా..." అని పిలుస్తున్న సుకన్య మాటలు వినికూడా విననట్లుగా గదిలో పడుకొని ఉంది పింకీ. 

 

 

 

ఎంతకీ పింకీ రాకపోవడంతో గదిలోకి వెళ్ళింది సుకన్య. "పింకీ నిన్నే పిలిచేది లే, లేచి రా అన్నం తిందువు."

 

 

 

"నాకు గంగమ్మ తినిపిస్తేనే తింటాను." 

 

 

 

"చూడు పింకీ నీకు ఉదయమే చెప్పాను అది ఇంక మనింటికి రాదు అని. లే లేచి రా.." అంటూ పాపని ఎత్తుకొని బయటకి తీసుకొచ్చి టేబుల్ ముందు కూర్చోబెట్టింది.

 

 

 

"నేను అన్నం తినను. గంగమ్మ పెడితేనే తింటాను."

 

 

 

"నీకెన్ని సార్లు చెప్పాను అది అమ్మ కాదు అని ఆయా అని. నేను నీకు అమ్మని."

 

 

 

"కాదు నువ్వు మమ్మీవి. గంగమ్మ నే నాకు అమ్మ."

 

 

 

"ఎవరే నీకు అమ్మ..ఇంకో సారి దాన్ని అమ్మా అని పిలిచావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు." పో లోపలికి అంటూ కోపంతో పాపని బలంగా లోపలికి తోసింది. 

 

 

 

ఆ దెబ్బకి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది పంకీ. 

 

 

 

ఉదయం పింకీని లేపడానికి గదిలోకి వెళ్లిన సుకన్య జ్వరంతో ఒనికిపోతున్న పింకీ ని చూసి భయంతో భర్తని పిలిచింది. పరుగుపరుగున హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 

 

 

 

స్పృహలేకపోయినా కూడా 'గంగమ్మా గంగమ్మా' అని కలవరిస్తూనే ఉంది. 

 

 

 

పింకీని పరీక్షించిన డాక్టర్ బయటకు రాగానే "ఆ పాపకి మీరు ఏమవుతాడు?" అని అడిగింది. 

 

 

 

"ఆ పాప మా కూతురండి." 

 

 

 

"అయితే మీ పేరు గంగా?"  

 

 

 

"కాదండీ"

 

 

 

"మరి ఆ పాప ఏమిటి ఎవరో గంగమ్మ అని కలవరిస్తుంది ఇంతకీ ఎవరావిడ?." 

 

 

 

"అది మా ఇంట్లో పని చేసి వెళ్లిన పని అమ్మాయి. అది వెళ్లినప్పటి నుండే పాప ఇలా అయింది." 

 

 

 

"అయితే పాప పరిస్థితి నాకు అర్ధమైంది ఒక్క నిముషం మీరు నా కేబిన్ కి రండి."

 

 

 

"చెప్పండి డాక్టర్ ఏంటి మా పాప పరిస్థితి. ఏమైంది తనకి?." 

 

 

 

"పాపకి ఏమి కాలేదు కానీ మీకే ఏమైందో తెలియట్లేదు. పాప మీ కన్న కూతురి కదా. మరి ఎందుకు అంత నిర్లక్ష్యం."

 

 

 

"నిర్లక్ష్యమా!? మా పాప విషయంలోనా!! ఎప్పుడూ చేయలేదు డాక్టర్. పాప హెల్త్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాము."

 

 

 

"నేననేది హెల్త్ గురించికాదు పాప పెంపకం గురించి. మీరిద్దరూ ఉద్యోగాలకు వెళ్తారు అవునా?"

 

 

 

"అవును."

 

 

 

"ఇంత చిన్న పాపని ఇంట్లో వదిలేసి ఇద్దరూ ఉద్యోగాలకు వెళితే పాప ఒంటరిగా ఫీల్ అవుతుందని అనిపించలేదా..!?"

 

 

 

"ఒంటరిగా ఎక్కడ ఉంటుంది స్కూల్కి వెళ్తుందిగా."

 

 

 

"సెభాష్ .. ఒంటరిగా ఉంటుందని నిండా 3 సంవత్సరాలు కూడా నిండని పసి పాపని స్కూల్ లో వేశారు...మరి తల్లి దండ్రులు ప్రేమ కరువైతే?"

 

 

 

"ఏంటి డాక్టర్ మీరనేది?"

 

 

 

"అవును మీ పాపకి కరువైంది మీ ప్రేమ. తల్లి పొత్తిళ్ళల్లో స్వేచ్ఛగా ఆడుకోవాల్సిన పాపని మీ ఉద్యోగాలకు అడ్డం కాకూడదని డే కేర్ అని స్కూల్ అని వేస్తే అందులో ఉండే వాళ్ళకి మీకు తేడా ఎలా తెలుస్తుంది వాళ్ళకి, మీ మీద ప్రేమ ఎలా కలుగుతుంది. అందుకే ఈ 2 నెలల్లో తల్లి ప్రేమ రుచిచూపించి పాపకి దగ్గరయ్యింది ఆ గంగ. అందుకే పాప ఆమెనే తల్లిగా భావిస్తుంది."

 

 

 

"మీరేమి చెప్తున్నారో నాకర్ధం కావట్లేదు డాక్టర్. తల్లి ప్రేమ కరువవడం ఏంటి...!!?"

 

 

 

"మీ పాప పరిస్థితి చూసినా మీకు ఇంకా అర్ధం కావట్లేదా!? మీ దగ్గర దొరకని తల్లి ప్రేమ ఆ గంగ దగ్గర దొరికింది. కాబట్టే ఇన్ని ఏళ్ళుగా పెంచిన మీ కన్నా ఆ గంగనే ఎక్కువగా కలవరిస్తుంది."

 

 

 

"అలా అని మీరెలా చెప్పగలరు....!! నా బిడ్డ మీద నాకు ప్రేమ లేదని చెప్పడానికి మీరెవరు?. ప్రేమ లేకుండానే తన భవిష్యత్తు కోసం ఇంతగా కష్టపడతామా! ప్రేమ లేకుండానే తను అడగకుండానే అన్ని కొని తెస్తామా! తన ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటామా.??"

 

 

 

"కాదని ఎవరన్నారు.. భవిష్యత్తు పేరుతో తన బాల్యాన్ని చిదిమేస్తున్నారు. తను అడగకుండానే అన్ని తెస్తున్నారు కానీ వాటితో ఆనందంగా ఆడుకుంటుందో లేదో ఏనాడైనా చూసారా?. ఆరోగ్యం కోసం ఎన్నో కొని తెస్తున్నారు కానీ అవన్నీ సరిగా తింటుందా లేదా! తినకుంటే ఎందుకు తినడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా..? పోనీ మీరు ప్రేమగా తనకి తినిపించగలుగుతున్నారా....!?

 

 

 

పాప మీ నుండి పొందలేనివి, ఇలా మీరు చేయలేని పనులన్నీ తను చేసింది కనుకే తన పట్ల పాపకి ప్రేమ కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ దగ్గర దొరకని తల్లి ప్రేమని రుచిచూపింది. అందుకే పాప అంతలా తననే కలవరిస్తుంది. ఈ వయసులో పాపకి కావలసింది మీరు సంపాదించే డబ్బు కాదు తన పట్ల మీరు చూపించే ప్రేమ అది ఉన్న నాడు ఈ గంగే కాదు ఆ దేవుడే వచ్చినా మిమ్మల్ని వదలదు."

 

 

 

"ఆ గంగే మా పాప కి ఏదో మందుపెట్టి మాయచేసి ఉంటుంది లేకుంటే 4 నెలల్లోనే మమ్మల్ని కాదని అదే కావాలని ఏడుస్తుందా...!?"

 

 

 

"ఇంత చెప్పిన తరువాత కూడా మీకు అర్ధం కావట్లేదా.... లోపం మీలో పెట్టుకొని అమయకురాలైన గంగ నెందుకు వేలెత్తి చూపుతున్నారు?"

 

 

 

"ఆ గంగ అమాయకురాలని మీకెలా తెలుసు..! ఇందాకటి నుండి దాన్ని వెనకేసుకొని వస్తున్నారు..అసలు మీకేం తెలుసు దాని గురించి.?"

 

 

 

"నాకే తెలుసు...అవును నాకే తెలుసు తన గురించి...ఎందుకంటే తను నా కూతురు కాబట్టి."

 

 

 

"ఏంటి డాక్టర్ మీరనేది ఆ గంగ మీ కూతురా!?"

 

 

 

"అవును...ఈ పాపిష్టి దానికి పుట్టిన బంగారం అది. 

 

మేము మీలాగే మా పాపకి అన్ని బాగా సమకూర్చాలని ఎంతో తాపత్రయ పడేవాళ్ళం..కానీ దానికి కావాల్సినది అవేమి కావు, మా ప్రేమ అని తెలుసుకోలేకపోయము. అది తన జీవితం మీద ఎంతలా ప్రభావం చూపిస్తుందో ఆ క్షణంలో ఊహించలేకపోయాము. తీరా తెలిసే సరికి ఆలస్యం అయిపోయింది. ఇక తనలా ఏ బిడ్డా బాధపడకూడదు అని నిర్ణయించుకుంది. అందుకే పిల్లల మానసికపరిస్తితికి సంబంధించి ఎంతో అధ్యయనం చేసింది. అందులో పి హెచ్ డి చేసి బంగారు పతకం సాధించింది. తన పరిశోధనలో తెలుసుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి తనలా తల్లితండ్రులు ఉండి కూడా వాళ్ళ ప్రేమకి నోచుకోని పిల్లల్ని ఎంచుకొని ఇలా వాళ్ళకి ఆ ప్రేమని దక్కేలా చేస్తుంది. అలా అని మిమ్మల్ని ఉద్యోగం మానమని చెప్పను ఉద్యోగం చేసుకుంటూ కూడా ఎంతో మంది వాళ్ళ పిల్లల్ని చక్కగా చూసుకోగలుగుతున్నారు. అలా చూసుకోగలిగితేనే ఉద్యోగం చేయండి." అంటూ ముగించింది.

 

 

 

"అదంతా విన్న పింకీ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అంటే ఇక మా పాప....!"

 

 

 

"మీరేమి ఖంగారు పడకండి. మీలో మార్పు రావడం కోసమే ఇలా చేసింది తప్ప పాపని మీ నుండి దూరం చేయడానికి కాదు. మీ పింకీని భద్రంగా మీకు అప్పచెప్తుంది." అంటూ నవ్వుతూ సాగనంపింది

Written by Bharadwaj